
జాగ్రత్తగా ఉండు- బాలయ్యను హెచ్చరించిన పిచ్చోడు: తారకరత్న భౌతికకాయం వద్ద షాకింగ్
హైదరాబాద్: ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత పట్ల పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. కిందటి నెల 27వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ పాదయాత్ర ప్రారంభం సందర్భంగా గుండెపోటుకు గురైన తారకరత్న 23 రోజుల పాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయాలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ కు తరలించారు.
ఫిల్మ్ ఛాంబర్ వద్ద..
తొలుత ఆయన భౌతికకాయాన్ని మోకిలలోని స్వగృహంలో ఉంచారు. ప్రముఖులు నివాళి అర్పించిన అనంతరం ఈ ఉదయం ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. నందమూరి కుటుంబం, తారకరత్న అభిమానులు పెద్ద ఎత్తున ఫిల్మ్ ఛాంబర్ కు చేరుకుంటోన్నారు. తారక్ భౌతిక కాయానికి కన్నీటితో నివాళి అర్పిస్తోన్నారు. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి, నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు అందరూ అక్కడే ఉన్నారు.
మోదీ సహా..
తారకరత్న మరణం పట్ల ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోపాటు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.. తారకరత్న భౌతిక కాయానికి నివాళి అర్పించారు.
పోటెత్తుతున్న అభిమానులు..
ఈ ఉదయం 10 గంటలకు తారకరత్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్ కు తీసుకుని వచ్చారు. ప్రముఖ నటుడు వెంకటేష్, ఆయన సోదరుడు, నిర్మాత దగ్గుబాటి సురేష్, నివాళి అర్పించారు. కేంద్ర మాజీమంత్రి పురందేశ్వరి, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్, తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఫిల్మ్ ఛాంబర్ లో తారకరత్న భౌతికకాయానికి నివాళి అర్పించారు. కడసారి చూపు కోసం నందమూరి అభిమానులు ఫిల్మ్ ఛాంబర్ కు పోటెత్తుతున్నారు. ఈ మధ్యాహ్నం 3:30 గంటలకు మహా ప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించనున్నారు.
అనూహ్య ఘటన..
కాగా- తారకరత్న భౌతిక కాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచినప్పుడు అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఓ మతిస్థిమితం లేని వ్యక్తి ఒకరు- భౌతిక కాయానికి నివాళి అర్పించారు. అనంతరం ఆయన నేరుగా నందమూరి బాలకృష్ణ వద్దకు వెళ్లారు. వేలెత్తి చూపుతూ గట్టిగా మాట్లాడారు. ఆయన చెప్పింది శ్రద్ధగా విన్నారు బాలకృష్ణ. కొంతసేపటి తరువాత పోలీసులు ఆ వ్యక్తిని బయటికి లాక్కెళ్లారు. చింపిరి జుట్టు, మాసిన గడ్డం, చిరిగిన దుస్తులతో కనిపించాడా వ్యక్తి. ఫిల్మ్ నగర్ పరిసరాల్లో రోడ్లపై తిరుగుతూ ఉంటాడని స్థానికులు చెప్పారు.