
కవల పిల్లలతో నీటి సంపులో దూకిన బాలింత!
ఆ భయమే కొంపముంచిందా?
ఈ మద్య చాలా మంది చిన్న విషయాలకే మనసు వికలం చేసుకొని డిప్రేషన్ లోకి వెళ్లిపోతున్నారు. ఆ సమయంలో అభద్రతా భావంతో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనులు ఎన్నో వెలుగులోకి వచ్చాయి.
క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల కుటుంబాల్లో విషాదాలు నెలకొంటున్నాయి. ఓ బాలింత తన పిల్లలు అనారోగ్యానికి గురి కావడంతో వారు చనిపోతారేమో అని భయంతో పిల్లలతో సహ తన ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద ఘటన అల్వాల్ లో జరిగింది. వివరాల్లోకి వెళితే..
అల్వాల్ శివనగర్ కి చెందిన సంధ్యారాణి అనే వివాహిత నెల రోజులు కూడా నిండని కవల పిల్లలతో నీటి సంపులో మునిగి ప్రాణాలు విడిచింది.
పుట్టి నెల కూడా నిండని పసికందులతో తల్లి మరణించడంతో ఆ కుటుంబంలో రోదనలు మిన్నంటాయి. సంధ్యారాణికి గతంలో ఒక మగడిడ్డకు జన్మనిచ్చింది.
కానీ కొద్దిరోజులకే ఆ చిన్నారి అనారోగ్యంతో కన్నుమూశాడు. ఆ తర్వాత సంధ్యారాణి మరోసారి గర్భందాల్చింది.. ఫిబ్రవరి 11న కవల పిల్లలకు జన్మనిచ్చింది. అంతా సంతోషంగా ఉన్న సమయంలో పిల్లలు అస్వస్థతకు గురయ్యారు. దీంతో కుటుంబంలో మరోసారి టెన్షన్ మొదలైంది.
అస్పత్రికి తీసుకు వెళ్లి చూపించారు. అయితే సంధ్యారాణికి మాత్రం మనసులో ఆందోళన మొదలైంది. మొదటి బాబు లాగే ఈ చిన్నారులకు కూడా చనిపోతారేమో అన్న భయం మొదలైంది.
ఇద్దరు చిన్నారుల్లో ఒకరు కోలుకున్నప్పటికీ తాను మేనరికం చేసుకోవడం వల్లనే ఇలాంటిది జరుగుతుందని.. ఆ కవలలు కూడా బతకరేమో అన్న భయంతో సంధ్యారాణి దారుణమైన నిర్ణయం తీసుకుంది. కవల పిల్లలతో కలిసి ఇంట్లో ఉన్న నీటి సంపులో మునిగి ప్రాణాలు తీసుకుంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
నెల కూడా నిండని చిన్నారులతో తల్లి ప్రాణాలు తీసుకున్న సంఘటనతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి.