
ఎంపీ నివాసంపై రాళ్ల దాడి.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు..
ఢిల్లీలోని ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై ఆదివారం (ఫిబ్రవరి 19) అర్థరాత్రి దుండగులు రాళ్ల దాడి చేశారు.
రాళ్ల దాడితో ఒవైసీ ఇంటి కిటికీలు పగులగొట్టారు. ఈ ఘటనను ఢిల్లీ పోలీసులు ధృవీకరించారు. ఇంటిపై రాళ్ల దాడి జరిగిన తర్వాత అసదుద్దీన్ ఒవైసీ పోలీసులను సంప్రదించి ఘటనపై సమాచారం అందించారు.
ఢిల్లీలోని తన నివాసంపై కొందరు గుర్తుతెలియని దుండగులు రాళ్లతో దాడి చేశారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. ఈ సంఘటన సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో అశోక్ రోడ్ ప్రాంతంలో జరిగింది. సమాచారం అందుకున్న ఢిల్లీ అదనపు డీసీపీ నేతృత్వంలోని పోలీసుల బృందం ఒవైసీ ఇంటికి వెళ్లి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది.
అయితే, ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై రాళ్ల దాడి..ఇదే ఫస్ట్ టైమ్ కాదు. నాలుగోసారి. గతంలో మూడుసార్లు ఢిల్లీలోని ఎంపీ అసదుద్దీన్ ఇంటిపై అటాక్ చేశారు దుండగులు.
పగిలిన కిటికీల అద్దాలు..
దేశ రాజధాని ఢిల్లీలోని అశోకా రోడ్డులోని అసదుద్దీన్ ఒవైసీ నివాసమిది. ఆయన ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు అటాక్ చేశారు. దుండగుల రాళ్ల దాడిలో ఇంటి కిటికీలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ పర్యటనలో ఉన్న తాను ఢిల్లీలోని తన నివాసానికి చేరుకునేసరికి కిటీకి అద్దాలు పగిలిపోయాయని..ఇంటి చుట్టూ రాళ్లు పడి ఉన్నాయని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేశారు అసదుద్దీన్.
అంతేకాదు. తన నివాసంపై దాడి చేయడం ఇది నాలుగోసారని ఫిర్యాదులో పేర్కొన్నారు..తన ఇంటి పరిసరాల్లో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు లేఖ రాశారు. సాయంత్రం 5:30 గంటల ప్రాంతంలో దుండగులు నివాసంపై రాళ్లు రువ్వారు.
ఇది నాలుగో దాడి..
ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ తన నివాసంపై దాడి చేయడం ఇది నాలుగోసారి.. తన ఇంటి చుట్టుపక్కల ప్రాంతాల్లో తగినంత సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని.. వాటిని యాక్సెస్ చేయవచ్చని, నిందితులను వెంటనే పట్టుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
తక్షణమే చర్యలు తీసుకోవాలని, నిందితులను త్వరితగతిన పట్టుకోవాలని ఆయన అన్నారు. దీనిపై పార్లమెంట్ స్ట్రీట్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఒవైసీ రెండు రోజుల రాజస్థాన్ పర్యటనలో ఉన్నారు, అక్కడ ఈ ఏడాది చివర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీ ప్రచారాన్ని ప్రారంభించారు.
నలుగు నిందితుల అరెస్ట్..
ఏఐఎంఐఎం అధినేత ఒవైసీ ఫిర్యాదు అందుకున్న పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.