
సూర్యాపేట జిల్లాలో 10 సెకన్ల పాటు కంపించిన భూమి.. అసలేం జరుగుతోంది?
Earth Tremors: పులిచింత ప్రాజెక్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో అప్పుడప్పుడూ ఇలాంటి ప్రకంపనలు వస్తుండడంతో… ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం సంభవించింది. కృష్ణానది తీర ప్రాంతంలోని చింతలపాలెం, మెళ్లచేరువు మండలాల్లో ఉన్న పలు గ్రామాల్లో ఆదివారం ఉదయం భూప్రకంపనలు నమోదయ్యాయి.
ఉదయం 7.25 గంటలకు.. సుమారు 10 సెకన్ల పాటు భూమి కంపించిందని స్థానికులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌లపై భూకంప తీవ్రత 3.2 గా నమోదయినట్లు సమాచారం.పెద్ద పెద్ద శబ్ధాలతో భూప్రకంపనలు రావడంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
ఆ శబ్ధాలు ఎక్కడి నుంచి వచ్చాయో అర్థంగాక అయోమయం చెందారు. చివరికి భూప్రకంపనలు అని తెలిసి.. భయంతో వణికిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు.
ఈ మండలాల్లో గతంలోనూ పలుమార్లు భూమి కంపించింది
ఏపీలో కూడా ఎన్టీఆర్ (NTR), పల్నాడు (Palnadu) జిల్లాలో భూప్రకంపనలు (Earth tremors) నమోదయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామ, కంచికర్ల, చందర్లపాడు, వీరులపాడు మండలాలతో పాటు పల్నాడు జిల్లాలోని అచ్చంపేట మండలం మాదిపాడు, చల్లగరిగ, గింజపల్లి గ్రామాల్లో స్వల్ప భూకంపం వచ్చింది.
పులిచింత ప్రాజెక్టు పరిసరాల్లో కూడా భూమి కంపించింది.ఈ ప్రాజెక్టు చుట్టు పక్కల ప్రాంతాల్లో అప్పుడప్పుడూ ఇలాంటి ప్రకంపనలు వస్తుండడంతో… ఎప్పుడు ఏం జరుగుతుందోనని స్థానికుల్లో ఆందోళన నెలకొంది.
వాస్తవానికి ఇది స్వల్ప భూకంపం. ఇలాంటి వాటితో ఇబ్బందేమీ లేదు. కానీ ఇటీవల సిరియా, టర్కీల్లో భారీ భూకంప ధాటికి.. వేల సంఖ్యలో ప్రజలు మరణించారు.
ఈ నేపథ్యంలో తమ ఊరిలోనూ భూమి కంపించిందని తెలిసి.. ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఏ జరుగుతుందోనని భయపడుతున్నారు.