
బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు.. సిబ్బంది సెల్‌ఫోన్లు సీజ్!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బీబీసీ కార్యాలయంపై ఐటీ దాడులు జరిగాయి. అధికారులు ముమ్మర సోదాలు నిర్వహించి కీలక పాత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
అంతేకాదు బీబీసీ సిబ్బంది సెల్‌ఫోన్లను కూడా సీజ్ చేసి వాళ్లను ఇళ్లకు పంపినట్లు తెలుస్తోంది. అటు ముంబైలోని బీబీసీ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు చెప్పాయి.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి ప్రధాని మోదీపై బీబీసీ ఇటీవల విడుదల చేసిన డాక్యుమెంటరీ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ వివాదాస్పద వీడియోలను కేంద్రం బ్యాన్ చేసింది. యూట్యూబ్, ట్విట్టర్‌లో ఇందుకు సంబంధించిన లింకులను బ్లాక్ చేసింది.
మరోవైపు బీబీసీని బ్యాన్ చేయాలనే పిటిషన్‌ను కూడా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో బీబీసీ కార్యాలయాలపై ఐటీ దాడులు జరగడం చర్చనీయాంశమైంది. అయితే దీనిపై అధికారులు ఇంకా అధికారికంగా స్పందించాల్సి ఉంది.
దాడులు కాదు.. సర్వే!
ఆదాయపు పన్ను శాఖకు చెందిన 15 మంది అధికారుల బృందం ఢిల్లీ, ముంబైలోని బీబీసీ కార్యాలయాల్లో సర్వే నిర్వహించిందని అధికారిక వర్గాలు చెప్పాయి. అంతర్జాతీయ పన్నులు, లావాదేవీల్లో అవకతవకలకు సంబంధించిన ఆరోపణలపైనే బీబీసీ కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపాయి.
సంస్థ వ్యాపార కార్యకలాపాలకు సంబంధించిన పత్రాలు, దాని భారతీయ విభాగానికి సంబంధించిన డాక్యుమెంట్లను పరిశీలించినట్లు పేర్కొన్నాయి. సర్వేలో భాగంగా, ఆదాయపు పన్ను శాఖ కేవలం కంపెనీ వ్యాపార ప్రాంగణాన్ని మాత్రమే కవర్ చేస్తుంది. సంస్థ ప్రమోటర్లు లేదా డైరెక్టర్ల నివాసాలు, ఇతర ప్రదేశాల్లో దాడులు చేయదు.
కాంగ్రెస్ రియాక్షన్..
బీబీసీ కార్యాలయంలో ఐటీ సోదాలపై కాంగ్రెస్ స్పందించింది. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెటంరీ కమిటీ(జేపీసీ) వేయాలని తాము డిమాండ్ చేస్తుంటే కేంద్రం మాత్రం బీబీసీ వెనకాల పడుతోందని విమర్శలు గుప్పించింది. ఈ మేరకు సీనియర్ నేత జైరాం రమేశ్ వీడియోను కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది.