
ఆశా వర్కర్ వేషధారణలో వచ్చి..విద్యార్థినికి సూది మందు ఇచ్చి మహిళ పరారీ
నవాబ్‌పేట: పాఠశాల ఆవరణలో ఒంటరిగా ఆడుకుంటున్న ఓ విద్యార్థినికి ఆశా వర్కర్ వేషధారణలో వచ్చిన గుర్తు తెలియని మహిళ సూది మందు ఇచ్చి పరారైన ఘటన సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలంలో వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి తల్లిదండ్రులు లక్ష్మణ్‌నాయక్, అలివేలు తెలిపిన వివరాల మేరకు నవాబ్‌పేట మండలం పుట్టోనిపల్లితండాలోని ప్రాథమిక పాఠశాలలో అనన్య నాలుగో తరగతి చదువుతోంది.
ఈనెల 9 సాయంత్రం పాఠశాల వద్ద అనన్య ఒంటరిగా ఆడుకుంటోంది. ఆశ వర్కర్ వేషధారణలో ఉన్న గుర్తు తెలియని మహిళ స్కూల్ బ్యాగును తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది.
తన బ్యాగ్ ఇవ్వాలని ఏడుస్తుండడంతో ఆ మహిళ అనన్య చెంపపై కొట్టి కుడిచేతికి సూదిమందు ఇచ్చి వెళ్లిపోయింది.
ఏడుస్తూ ఇంటికి వెళ్లిన చిన్నారిని తల్లిదండ్రులు ప్రశ్నించగా జరిగిన విషయం చెప్పింది. వారు గ్రామంలోని ఆశ వర్కర్లను సంప్రదించగా.. తాము ఎలాంటి సూదిమందు ఇవ్వలేదని చెప్పారు.
మరుసటి రోజు విద్యార్థిని అస్వస్థతకు గురికావడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు.
వైద్యులు పరీక్షించి బ్లడ్ ఇన్‌ఫెక్షన్ అయ్యిందని, చికిత్స అందించారు. అనంతరం చిన్నారిని ఇంటికి తీసుకెళ్లారు. సోమవారం మళ్లీ అస్వస్థతకు గురవడంతో మహబూబ్‌నగర్‌లోని మరో ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పురుషోత్తం తెలిపారు.