
సడన్‌గా తాడేపల్లిలో ప్రత్యక్షమైన పొంగులేటి!
జగన్‌తో ప్రత్యేక భేటీ- !!
అమరావతి: ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, లోక్ సభ మాజీ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస రెడ్డి కొంతకాలంగా రోజూ వార్తల్లో నిలుస్తోన్నారు.
అధికార భారత్ రాష్ట్ర సమితికి ఆయన దాదాపుగా దూరం అయ్యారు. రాజీనామా చేయడం ఒక్కటే మిగిలివుందనే అభిప్రాయాలు జిల్లా రాజకీయాల్లో వ్యక్తమౌతోన్నాయి.
తొలుత భారతీయ జనతా పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నప్పటికీ- అది సాధ్యపడలేదు. కాషాయ కండువాను కప్పుకోవడానికి పెద్దగా ఆసక్తి చూపట్లేదని చెబుతున్నారు.
వైటీపీలో చేరిక లాంఛనమే..
ఈ క్రమంలో ఆయన వైఎస్ షర్మిల సారథ్యాన్ని వహిస్తోన్న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరొచ్చని, ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది.
ఇదివరకే ఆయన వైఎస్ షర్మిలతో మంతనాలు సాగించారు. సుదీర్ఘంగా టెలిఫోన్ లో మాట్లాడారు. పార్టీలో చేరితే భారీ ఆఫర్ ఇస్తామనే హామీ సైతం షర్మిల చేసినట్లు చెబుతున్నారు.
దీనికి పొంగులేటి కొన్ని షరతులను విధించారని, వాటిపై ఓ అంగీకారానికి వస్తే- వైఎస్ఆర్టీపీలో ఆయన చేరిక లాంఛనప్రాయమే అవుతుందని అంటున్నారు.
వైఎస్ కుటుంబంతో అనుబంధం..
నిజానికి- వైఎస్ కుటుంబంతో పొంగులేటికి సన్నిహత సంబంధాలు ఉన్నాయి. రాజకీయాలకు అతీతంగా ఆయన వైఎస్ కుటుంబాన్ని అభిమానిస్తోన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఖమ్మం లోక్ సభకు పోటీ చేశారు పొంగులేటి.
అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభంజనాన్ని సైతం తట్టుకుని ఘన విజయాన్ని సాధించారు. తన లోక్ సభ పరిధిలో రెండు అసెంబ్లీ స్థానాలను కూడా గెలిపించుకోగలిగారు.
జిల్లా రాజకీయాల్లో వేడి..
ఈ పరిణామాలు ఖమ్మం జిల్లా రాజకీయాలను వేడెక్కిస్తోన్నాయి. వైఎస్ షర్మిల కూడా ఈ జిల్లా నుంచే అసెంబ్లీకి పోటీ చేయనున్న నేపథ్యంలో వైఎస్ఆర్టీపీపై విమర్శల దాడి తీవ్రతరమైంది.
అదే క్రమంలో పొంగులేటిపై కూడా మాటల యుద్ధానికి దిగుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. దమ్ముంటే ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్ కు రాజీనామా చేయాలంటూ జిల్లా నాయకులు పొంగులేటి సవాళ్లు విసరడం వాతావరణాన్ని వేడెక్కింపజేసింది.
జగన్ తో భేటీ..
ఈ పరిస్థితుల మధ్య పొంగులేటి శ్రీనివాస రెడ్డి అనూహ్యంగా తాడేపల్లిలో ఏపీ ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ప్రత్యక్షం అయ్యారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సమావేశం అయ్యారు.
వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. వైఎస్ కుటుంబం, వైఎస్ జగన్ తో ఉన్న వ్యక్తిగత అనుబంధంతోనే ఆయనను కలిశారని చెబుతున్నారు.
రాజకీయంగా పునర్జన్మ..
ఈ సందర్భంగా పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేసినట్లు చెబుతున్నారు. రాజకీయంగా పునర్జన్మ పొందడం ఒక్క వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే సాధ్యపడుతుందనే ధీమాను వ్యక్తం చేసినట్లు సమాచారం.
వైఎస్ఆర్టీపీలో చేరడం ద్వారా ఉత్తర తెలంగాణలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలుస్తోంది. సొంత పార్టీ నేతలే పొంగులేటికి పొగ పెడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇక ఆయన బీఆర్ఎస్ కు రాజీనామా చేయడం ఖాయమైనట్టే. బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రోజే ఆయన వైఎస్ఆర్టీపీలో చేరే అవకాశాలు లేకపోలేదు.