
మా కష్టార్జితమే నీకు ఎమ్మెల్యే పదవి..
దమ్ముంటే తక్షణమే రాజీనామా చేసి మరలా గెలవాలి..
విజయభాయిని ప్రకటించగానే బీఆర్ఎస్ కు వణుకు మొదలైంది..
దాతృత్వంతో పాటు జనహృదయనేత పొంగులేటి..
15న వైరాలో ఆత్మీయ సమ్మేళనం..
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ తాతా మధుపై బొర్రా రాజశేఖర్ పైర్..
వైరా నియోజకవర్గంలో మాపై ప్రజలకున్న విశ్వాసం, నమ్మకమే ఎమ్మెల్యే గెలుపుకు కారణమని, తక్షణమే ఆ పదవికి రాజీనామా చేసి దమ్ముంటే గెలవాలని మార్క్ ఫెడ్ రాష్ట్ర వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ సవాల్ విసిరారు.
బుధవారం వైరాలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమకు పదవులు అయోచితంగా, ఊరికే రాలేదని, తమ శ్రమను గుర్తించి మా కష్టార్జితంతోనే వచ్చాయని గుర్తుచేశారు.
ఆనాడు రాములు నాయక్ అంటే నియోజకవర్గ ప్రజలకు తెలియదని, తమ పట్ల విశ్వాసం, జనామోదం ఉండటం వల్లే పొంగులేటి శ్రీనివాస రెడ్డి కృషితో రాములు నాయక్ గెలుపొందారన్నారు. అంత దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి గెలవా లన్నారు.
అమెరికాలో ఉండి జోడు పదవులు తెచ్చుకున్న తాత మధు తన పదవులను కాపాడుకోవడం కోసం మాట్లాడుతున్నారని, ఈసారి ఎన్నికల్లో శ్రీనివాస రెడ్డి మీద పోటీచేసి డిపాజిట్ తెచ్చుకుంటే రాజకీయాల నుండి తాము శాశ్వతంగా తప్పుకుంటామన్నారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఛరిస్మ, జనహృదయనేత అని, జిల్లాలో ఎన్నో కుటుంబాలను ఆపదలో ఆదుకున్నారన్నారు.
వైరా నియోజకవర్గంలో విజయబాయిని అభ్యర్థిగా ప్రకటించగానే బీఆర్ఎస్ నాయకుల్లో వణుకు ప్రారంభం అయిందన్నారు. ఎమ్మెల్యే ఆస్తులు శ్రీనివాస రెడ్డి రాయించుకున్నారని ఆరోపణలు చేస్తున్నారని, ఎమ్మెల్యేకు చదువు రాదా.. అని ఎదురు ప్రశ్నించారు. తాము విలువలతో కూడిన, స్నేహపూర్వక రాజకీయాలే చేశామన్నారు.
మీలా నాలుగేళ్లు వాడుకొని ఇలా ఆరోపణలు చేయటం బాధాకరమన్నారు. ఈ మాటలన్నీ నాలుగుగోడల మధ్య పోలీస్ బందోబస్తు నడుమ అన్నారు కాబట్టి బ్రతికిపోయారని, అదే గ్రామాల్లో, జనాల్లో అంటే ఆ పరిణామం వేరే తీరుగా ఉండేదన్నారు.
ఈ నెల 15వ తేదీన వైరాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి వైరా నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు, కార్యకర్తలు, ప్రజలు హాజరై విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్ సూతకాని జైపాల్, బీఆర్ఎస్ నాయకులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.