
మిర్చి వ్యాపారి కిడ్నాప్
తోటి వ్యాపారి పనేనని అనుమానం
బాధితుడిని కాపాడిన పోలీసులు
గుంటూరు : గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం గుంటూరు మిర్చి యార్డు సమీపంలో ఓ వ్యాపారిని కిడ్నాప్ చేశారు.
పోలీసులు వెంటనే స్పందించి అతన్ని దుండగుల నుంచి కాపాడారు. గుంటూరులో సంచలనం సృష్టించిన ఘటన వివరాలిలా ఉన్నాయి..
కొత్తపేటకు చెందిన పొత్తూరి శివ నరేంద్రకుమార్ మిర్చి వ్యాపారి. బుధవారం ఉదయం ద్విచక్ర వాహనంపై మిర్చి యార్డుకు బయలుదేరారు.
కాపుగాసిన ఆరుగురు దుండగులు అతనిపై దాడి చేశారు. బలవంతంగా కారులో తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నరేంద్రకుమార్ కుమారుడు కృష్ణచైతన్య నగరంపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవాపురానికి చెందిన మిర్చి వ్యాపారి బర్మా వెంకట్రావు తన తండ్రిని కిడ్నాప్ చేయించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
సీఐ హైమారావు వెంటనే ఉమ్మడి గుంటూరు జిల్లాలోని అన్ని పోలీసు స్టేషన్లకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వినుకొండ వద్ద పోలీసుల తనిఖీలు గమనించిన దుండగులు నరేంద్రకుమార్‌ను కారులో వదిలేసి పరారయ్యారు.
పోలీసులు కారులో నరేంద్రకుమార్‌ను గుర్తించి, అతన్ని గుంటూరుకు తీసుకొచ్చారు. బాధితుడు మాట్లాడుతూ ‘నన్ను కొట్టి..
రూ.1.5 కోట్లు ఇవ్వాలని డిమాండు చేశారు. ప్రాణభయంతో అంగీకరించా. బర్మా వెంకట్రావు కోటప్పకొండ వద్ద కిడ్నాపర్లతో చేరాడు. చొక్కాకు రక్తం అంటడంతో మార్చేందుకు వినుకొండ వద్ద కారు ఆపారు.
అప్పుడే పోలీసులు చూసి నన్ను రక్షించారు’ అని తెలిపారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. వెంకట్రావును పోలీసులు అదుపులో తీసుకున్నట్లు సమాచారం. అంతకుముందు నరేంద్రకుమార్ కిడ్నాప్‌ను నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన చేశారు.