
సవాళ్ళకు సమాధానం లేని బడ్జెట్
ఉపాధికి కోత, వ్యవసాయానికి పెంచింది లేదు
ద్రవ్యోల్బణం – ధరల బాధలు మామూలే
` -సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
ఖమ్మం, ఫిబ్రవరి 1 (బుధవారం):మాటల్లో ఘనం, కేటాయింపుల్లో తిరోగమనం. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ళకు సమాధానం దొరకని కేంద్ర బడ్జెట్ అని సి.పి.ఎం. ఖమ్మం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రానికి ఖమ్మం జిల్లాకి కొత్త ప్రతిపాదనలేమీ లేకపోగా గతంలో హామీ యిచ్చిన వాటి ఊసే లేదన్నారు. 45,03,097 కోట్లతో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2023
24 కేంద్ర బడ్జెట్‌లో గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే ఉపాధి హామీకి గతానికంటే 30 వేల కోట్లు తగ్గించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని (2022 నాటికే) ఊదరగొట్టిన బిజెపి విధానాల వలన అప్పులు, ఆత్మహత్యలు రెట్టింపు అయినాయని అన్నారు. కనీసం ఈ బడ్జెట్‌లో ఒక్క రూపాయి పెంచలేదన్నారు. వ్యవసాయ ఉపకరణాల రేట్లతో పోల్చుకుంటే గతాని కంటే కేటాయింపులు తగ్గాయని, మద్ధతు ధరల చట్టం ఊసే లేదన్నారు. మన ఆర్థిక వ్యవస్థ 5వ స్థానంలో ఉందని గప్పాలు కొడుతున్న నోటితోనే 81 కోట్ల మంది ఆకలి బాధితులకు అన్న యోజన కొనసాగిస్తామని చెప్పటం, ఆకలి సూచీలో 191 దేశాల్లో 140వ స్థానంలో ఉండటం, ఆరోగ్యంలో 66వ స్థానం, విద్యలో 33వ స్థానంలో ఉండటం మన అభివృద్ధి డొల్లతనాన్ని సూచిస్తుందన్నారు. దేశానికున్న 137 లక్షల కోట్ల అప్పుకు ఈ బడ్జెట్ 11 లక్షల కోట్లు వడ్డీలకే పోతుందన్నారు. విద్య, వైద్య రంగాలకు కేటాయింపులు తగ్గాయని, ఉత్పాదక, ఉపాధి రంగం కేటాయింపులు లేవన్నారు. కార్పొరేట్లకు 12 లక్షల కోట్లు మాఫీ చేసిన బిజెపి ప్రభుత్వం రైతు రుణమాఫీకి 2 లక్షల కోట్లు కేటాయించటానికి సిద్దంగా లేదన్నారు. బయ్యారం ఉక్కు పరిశ్రమ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, భద్రాచలం`కొవ్వూరు రైల్వేలైన్, విభజన హామీల ఊసేలేదన్నారు. వేతన జీవులకు 7 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు చిన్న ఊరట అయినా కేవలం 35 వేల కోట్లు మాత్రమేనన్నారు. మధ్య, చిన్న, సూక్ష్మతరహా (ఎం.ఎస్.ఎం.ఇ.) పరిశ్రమలకు 2% శాతం పన్ను మినహాయింపు యివ్వటం కంటి తుడుపు చర్యేనని, కార్పొరేట్లకు మాత్రం 10 శాతం తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.