టెట్‌ ఫలితాల్లో 150కి 151 మార్కులు

Spread the love

టెట్‌ ఫలితాల్లో 150కి 151 మార్కులు సాధించిన అభ్యర్ధులు..! అధికారుల వివరణ ఇదే..
ఎంత తెలివైన విద్యార్ధులకైనా నూటికి 101 మార్కులు ఎక్కడైనా వస్తాయా? కలలలో తప్ప ఇలలో అసలిది సాధ్యమా..! సాధ్యమేనని నిరూపించారు ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ అధికారులు.

తాజాగా ఏపీ టెట్‌ 2022 పరీక్ష నిర్వహించగా.. ఆ పరీక్ష ఫలితాలు నిన్న (శుక్రవారం) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ఓ అభ్యర్ధికి ఏకంగా 150 మార్కులకు 151 మార్కులు వచ్చాయండీ! ఒక అభ్యర్ధికి మాత్రమే కాదు.. ఏకంగా 8 మంది ఎస్జీటీ అభ్యర్ధులకు ఈ రీతిలో మార్కులు వచ్చాయి. 150 మార్కులకు పరీక్ష నిర్వహిస్తే 151, 150.86, 150.64, 150.26 మార్కులు సాధించిన వాళ్లు కూడా ఉన్నారు. ఇదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? అధికారులు నిర్వహించిన నార్మలైజేషన్‌ విధానంతో ఈ పరిస్థితి దాపురించింది. టెట్‌ పరీక్ష150 మార్కులకు ఉంటుంది. ఈ పరీక్షలో 100 మార్కులు సాధించడమే గగనం. అలాంటిది సెప్టెంబర్‌ 29న విడుదలైన టెట్‌ ఫలితాల్లో 150కి 150 మార్కులు రావడం వెనుక మర్మం ఏమిటో కూడా అభ్యర్ధులకు అర్ధం కావడం లేదు.

కాగా ఆగస్టు 6 నుంచి ఆగస్టు 21వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆన్‌లైన్‌ విధానంలో దాదాపు 16 రోజుల పాటు టెట్‌ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,07,329 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. ఈ పరీక్షల ప్రశ్నాపత్రం ఓ రోజు కఠినంగా, మరో రోజు సులువుగా వచ్చే అవకాశం ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో అభ్యర్థులందరికీ సమ న్యాయం చేసేందుకు నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేస్తారు. ఏపీఈఏపీసెట్, జేఈఈ మెయిన్స్, అడ్వాన్సుడ్‌ వంటి జాతీయ పరీక్షల్లోనూ ఇదే పద్ధతిని అనుసరిస్తారు. సాధారణంగా నార్మలైజేషన్‌ చేసే సమయంలో150 మార్కుల కంటే ఎక్కువ వస్తే.. వాటిని 150 మార్కులకే పరిమితం చేస్తారు. ఇదంతా ఫలితాల విడుదలకి ముందే చేస్తారు. ఐతే ఏపీ పాఠశాల విద్యాశాఖ మాత్రం ఫలితాల విడుదలలో ఎలాంటి పరిశీలన చేసుకోకుండానే 150కి 151 మార్కులను ఇచ్చేసింది. దీంతో అభ్యర్థులు తీవ్ర గందరగోళానికి గురయ్యారు.

దీనిపై స్పందించిన విద్యాశాఖ ఈ విధంగా క్లారిటీ ఇస్తూ.. కఠిన ప్రశ్నపత్రంలోనూ ఎక్కువ మార్కులు వచ్చిన అభ్యర్థులకు 150 కంటే ఎక్కువ మార్కులు వచ్చాయని అధికారులు తెలిపారు. ప్రశ్నపత్రం తేలికగా ఉన్న వారికి ఎక్కువ మార్కులు వస్తే కఠినంగా వచ్చిన వారికి అదనంగా మార్కులు కలుస్తాయని, ఇలాంటి సమయంలో ఇలా గరిష్ఠ మార్కులకంటే అధికంగా స్కోర్‌ వచ్చే అవకాశం ఉంటుందని, ఐతే ఇటువంటి సందర్భంలో 150 మార్కులను మాత్రమే ఇస్తామని, 150కి పైన వచ్చిన ఫలితాలను సరిచేస్తామని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఐతే సాధారణంగా టెట్‌ పరీక్షలో 150కి 150 మార్కులు రావడం అనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతుంది. ఈ ఏడాది నిర్వహించిన టెట్‌లో మాత్రం ఎక్కువమంది అభ్యర్థులకు వందశాతం మార్కులు రావడంపైనా కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌(ఎస్జీటీ)కు పేపర్‌-1ఏ, విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక పాఠశాలల్లో 1-5 తరగతుల బోధనకు పేపర్‌-బీ, స్కూల్‌ అసిస్టెంట్లకు పేపర్‌-2ఏ, ప్రత్యేక ఉపాధ్యాయులకు పేపర్‌-2బీ పెట్టారు. ఈ పరీక్షను 150 మార్కులకు నిర్వహించారు.

5,259 Views

One thought on “టెట్‌ ఫలితాల్లో 150కి 151 మార్కులు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?