తెలంగాణలో ఐదో పార్టీకి చోటుందా?

Spread the love

మళ్లీ కొత్త పార్టీ టాక్ తెలంగాణ వినబడుతూ ఉంది.  ఆ మధ్య వైఎస్ షర్మిల ‘రాజన్న రాజ్యం’ పేరు తెస్తాననని  ‘వైఎస్ ఆర్ తెలంగాణ’ పార్టీ ఏర్పాటు చేశారు. ఆమె ఇపుడు రాష్ట్రంలో రాజకీయ యాత్ర చేస్తున్నారు. రైతులను, నిరుద్యోగులను కలుసుకుంటూ ఉన్నారు. ఆమె సభలకూ జనం బాగానే వస్తున్నారు. ఆమెకు బొట్టుపెట్టి స్వాగతం పలుకుతున్నారు.

ఆమె మాంచి పొలిటికల్, సోషల్  క్యాపిటల్ తో వచ్చారు. ఆమె తండ్రి వైఎస్ ఆర్  పేరు బాగా పాపులర్.  తను ధైర్యవంతురాలు.  ఆమె బాగా బలమయిన రెడ్డి కులానికి చెందిన నాయకురాలు. అన్నింటికంటే ముఖ్యంగా పార్టీని   ఎన్నికల దాకా పోషించగల ఆర్థిక బలం ఉన్న నాయకురాలు. ఈ కారణాలన్నింటి వల్ల వైఎస్ ఆర్ తెలంగాణ టెకాఫ్ బాగా జరిగింది.

ఎవరేమనుకున్నా పర్వాలేదు, నేనుముందుకే పోతానని సాగుతున్నారు. అయితే, ఇటీవల  మీడియాలో ఆమెకు ప్రచారం మెల్లిగా తగ్గుతూ ఉంది.అయినా సరే ఆమె ఉత్సాహంగా పోతున్నారు. ఆమె ఆంధ్రకు చెందిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా,  తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు  చూసి చూడనట్లు పోవడమే ఆశ్చర్యం. ఎందుకంటే, ‘మా రాష్ట్రం మాకు వదిలిపెట్టండి, మీ పెత్తనం చాలు’ అనేదే  తెలంగాణ నేతలు ఆంధ్ర రాజనేతల మీద ప్రయోగించిన అస్త్రం. దీనికి ఆమె ‘నేను  తెలంగాణ కోడలిని, నాకు మెట్టినింటి హక్కు ఉంది,’ అని వాదించారు. షర్మిల బెదిరిపోయే రకం కాదు.

ఇపుడు చాలా మంది  కొత్త పార్టీ  పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తూ ఉంది. బిజెపి హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పార్టీ పెడతాడనే టాక్  ఉంది. ఇలాగే మాజీ ఎంపి కొండా విశ్వేశర్ రెడ్డి పార్టీ కూడా పార్టీ పెడతారని అంటున్నారు. ఇద్దరు కలిసి పార్టీ పెడతారని మరొక ప్రచారం. ఇదే కాకుండా తెలంగాణ తొలినాళ్ల ఉద్యమకారులంతా కలసి మరొక పార్టీ పెడతారనేది మరొక వూహాగానం.

ఈటల రాజేందర్ కు మాంచి పొలిటికల్, సోషల్ క్యాపిటల్ ఉంది. నాయకత్వ లక్షణాలున్నాయి. ఆర్థికంగా కూడా బలవంతుడేనని చాలా మంది చెబుతారు. అవి ఇంతవరకు పరీక్ష ఎదుర్కోలేదు. టిఆర్ ఎస్ క్యాబినెట్ నుంచి అవినీతి అక్రమాల ఆరోపణలతో బయటకు పంపించినపుడు రాజేందర్ పాపులారిటీకి  విషమ పరీక్ష ఎదురవుతుందని అనుకున్నారు.

ఎందుకంటే  ప్రజాస్వామ్యంలో  ప్రతిదానికి ఎన్నికల్లో గెలవడమే గీటురాయి. ఈటల రాజేందర్ హుజూరాబాద్ అసెంబ్లీ సీటుకి రాజీనామా చేసి ఇండిపెండెంటుగా పోటీ చేసి తన సత్తా నిరూపించుకుంటాడనుకున్నారు. అయితే, కథ మరొక మలుపు తిరిగింది. ఆయన బిజెపిలో చేరిపోయి ఎన్నికల్లో పోటీ చేశారు. బిజెపి కూడా పాపులర్ లీడర్ అయిన రాజేందర్ ని గెలిపించుకుంటే, రాష్ట్రంలో పునాది విస్తృతమవుతుందని భావించింది. నిజానికి ఆ ప్రాంతంలోబిజెపి పెద్ద ఫోర్స్ కాదు. రాజేందర్ స్వయంగా గెలిచినా, క్రెడిట్ పార్టీ ఖాతాలోనే పడుతుంది కాబట్టి, ఆయన గెలుపుతో బిజెపికి విపరీతంగా క్రేజ్ పెరిగింది. ఆయనే బిజెపి ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నారు….ఏంజరిగిందో ఏమో ఆయన బిజెపి నుంచి బయటకు వస్తాడని, కొత్త పార్టీ పెడతారని టాక్ మొదలయింది.

. తెలంగాణలో ఇప్పటికే మూడు పార్టీలున్నాయి. అవి టిఆర్ ఎస్, కాంగ్రెస్, బిజెపి. వామపక్షాల రోల్ బాగా తగ్గిపోయింది.  ఈ మధ్యలో వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీ వచ్చింది. ఇపుడు రాబోయేది అయిదో పార్టీ అవుతుంది. ఎవరంతకు వాళ్లు విడివిడిగా పెడితే, ఆరు, ఏడు,ఏనిమిది పార్టీలవుతాయి.

ఇన్ని పార్టీలకు చోటుందా?

తెలంగాణ  రాష్ట్రంలో ఇన్ని పార్టీలకు చోటుంటుందా? ఒక రెండు మూడేళ్ల కిందట  కాంగ్రెస్ బలహీన పడుతున్నపుడు, బిజెపిలో ఎదుగు బొదుగు లేనపుడు, తెలంగాణ రాష్ట్రం  ‘ఏక పక్ష రాష్ట్రం’గా ఉన్నపుడు కొత్త పార్టీ టాక్ రానేలేదు. ఎవరో కొంతమంది విప్లవ భావాలున్నవాళ్లు ముందుకొచ్చారు. అవి ప్రకటనల మించి ఒక్కడుగు కూడా ముందుకు కదల్లేకపోయాయి. నిజానికి  అపుడు మరొక పార్టీకి మంచి అవకాశం ఉండింది. యాంటికెసిఆర్/టిఆర్ ఎస్  పార్టీ అవతరించేందుకు అనువైన సమయం. ఏ పార్టీ రాలేదు. కెసిఆర్ ఒక్కరే తిరుగులేని నాయకుడయ్యారు. ఇంకా కొనసాగుతున్నారు.

అయితే, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కు ఎంపి ఎ రేవంత్ రెడ్డిచీఫ్ కావడం, బిజెపికి ఎన్నికలవల్ల కొంత ప్రయోజనం చూకూరడంతో ఒక సారిఈ రెండు పార్టీలు జఢత్వం విదిలించుకుని యాక్టివ్ అయ్యాయి. అంతవరకు తెలంగాణ రాజకీయాలలో ఏమి మాట్లాడినా  ముఖ్యమంత్రి కెసిఆర్ కే చెల్లేది.  కాంగ్రెస్ కు రేవంత్ నాయకత్వం, బిజెపికి బండిసంజయ్ నాయకత్వం వచ్చాక, కెసిఆర్ మీద, ఆయన కుటుంబం మీద దాడులు సమాన స్థాయిలో తీవ్రమయ్యాయి.  ఈ దాడులు  రాష్ట్ర ప్రజల్లో రాజకీయాసక్తిని పెంచాయి. ఎందుకంటే, చాన్నాళ్ల తర్వాత తెలంగాణలో కెసిఆర్ కు  వ్యతిరేకంగా  రెండు గొంతుకలు వినపడడం మొదలయింది. 

2014 కు ముందు, ఆ తర్వాత కూడా తెలంగాణలో ప్రముఖంగా  వినిపించిన ఎకైక గొంతుక కెసిఆర్  దే.  2014కు ముందు కెసిఆర్ చెప్పిందే మాట, చురక.  2014 లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక   హరీష్ రావు, కెటిఆర్, కవితలే స్పీకర్స్.  మరొక గొంతుక వినిపించలేదు. కాంగ్రెస్ లో ఉన్నపుడు గట్టిగా మాట్లాడి మంచి పేరు తెచ్చుకున్న  కె. కేశవరావు టిఆర్ ఎస్ లో చేరిపోయాక  మాట్లాడకుంటేనే మంచిదనే నిర్ణయానికి వచ్చారు. ఈ పరిస్థితి  కాంగ్రెస్ లో రేవంత్,  బిజెపి లో బండి సంజయ్ రంగంలోకి దిగేవరకు కొనసాగింది. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ బిజెపిలలో నాయకులు లేరని కాదు,  ఉన్నారు. కారణమేమో గాని వాళ్ల గొంతు జనాలని తన  వైపు  తిప్పుకోలేకపోయింది. రేవంత్ , బండి తెలంగాణ రాజకీయాల్లో వూపు తెచ్చారు.   టిఆర్ ఎస్ ను  టార్గెట్ చేసుకుని సుడిగాలి సృష్టించారు.

కెసిఆర్ అంతటి గొప్పనేత పక్కన ఉన్నపుడు, లెక్క ప్రకారం రేవంత్, బండి సభలకు జనం రానేకూడుదు.  వీళ్ల సభలకు విపరీతంగా వస్తున్నారు. చూసే వాళ్లకి ఏమనిపిస్తుంది? ఎక్కడో ఏదో జరుగబోతున్నదనిపిస్తుంది. ఇపుడు రాష్ట్రంలో యాంటి టిఆర్ ఎస్   స్పేస్ ను రేవంత్, బండి ఆక్రమించుకుంటున్నారు. ఇక  బిజెపి విషయానికి వస్తే, ‘అదిగో బిజెపి వస్తాఉంది’ అనే టాక్ ను  సృష్టించగలిగింది. అంటే ఈ రెండు పార్టీలను ప్రజలు ఆసక్తి గమనించడమ మొదలయిందని చెప్పాలి.

షర్మిల ఎలాంటి ప్రభావం చూపిస్తారో ఇపుడే చెప్పడం కష్టం. ఇలాంటపుడు కొత్త పార్టీల మనుగడ సాధ్యమా?

కొత్త పార్టీల నేతలు ఏ నినాదం ఇస్తారు? అవినీతి, కుటుంబపాలన, బంధుప్రీతి వంటి నినాదాలు ఇక పనికి రావు. వాటిని కాంగ్రెస్, బిజెపి బాగా వాడుకుంటున్నాయి. జనం కూడా వింటున్నారు. ఇలాంటి జనాన్ని తన వైపు తిప్పుకునేంతటి శక్తివంతమయిన నినాదం  ఈ నేతలు  కనిపెట్టాలి. లేకపోతే, కేవలం కొత్త పార్టీ అనే మాట  ఆకర్షణ కాజాలదు.

కొత్త పార్టీలెలాపుట్టాయి

భారత దేశచరిత్రలో కొత్త పార్టీలన్నీ కొత్త నినాదంతోనే వచ్చాయి. కొత్త దనం ఆఫర్ చేసి జనాలను తన వైపు తిప్పుకున్నాయి.  నినాదం కనుగొనలేని పార్టీలు  విజయవంతకాలేదు. ఉదాహరణకు  పవన్ కల్యాణ్ కు నినాదమే దొరకలేదు. దానితో ఆయన  ఆ రోజు టిడిపి, ఈ రోజు వైసిపి పరిపాలనలను విమర్శిస్తూ పోతున్నారు. అదొక్కటే చాలదని జనసేన చరిత్ర చెపుతుంది. అందుకే పదేళ్లవుతన్నా జనసేన పార్టీ చిగురేయడం లేదు. దానికి భిన్నంగా 2009లో చిరంజీవి శక్తివంతమయిన సామాజిక న్యాయం తో ముందుకు వచ్చాడు. 18 స్థానాలు గెల్చుకున్నాడు. వాటికి కాంగ్రెస్ కు కానుకగా సమర్పించి కేంద్రం లో మంత్రి కావడం వేరే విషయం. ఇలా కొత్త నినాదంతో వచ్చిన పార్టీలే విజయవంతమయ్యాయి.  1983లో తెలుగుదేశం కాని,  2014లో టిఆర్ ఎస్ గాని ఇలా ఇలా కొత్త నినాదంతో వచ్చి గెలుపొందినవే.  బిఎస్ పి, జెఎంఎం, శివసేన, ఆర్జెడి, ఎస్ పి, ఎజిపి చివరకు తమిళనాడులోని చిన్న పార్టీలయిన పిఎంకె వంటివి కూడా సొంత నినాదాలతో వచ్చి విజయవంతమయ్యాయి,  కొంతకాలమైనా రాజకీయాల్లో నిలదొక్కుకున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో లేకుండా వచ్చి నిలబడిన పార్టీ శరద్ పవార్ ఎన్ సిపియే. ఆయన ఎలాంటి కొత్త నినాదం తీసుకు రాలేదు. కేవలం వ్యక్తిగత ప్రతిష్టతో వచ్చారు. విజయంతమయ్యారు. ఒదిశా బిజూ జనతా దళ్ కు కూడా కాంగ్రెస్ వ్యతిరేక చరిత్ర ఉంది.

కొత్త దనం చూప లేని శరత్ కుమార్ పార్టీ తమిళనాడులో ప్రభావం చూపలేకపోతున్నది. కమల్ హాసన్ పార్టీ ది  ఇదే పరిస్థితి. కొత్తదనం ఏమియ్యాలో తెలియకనే రజినీ కాంత్ భయపడి  నాన్చి నాన్చి రాజకీయాలే వద్దని పారిపోయారు.

అందువల్ల కొత్త పార్టీ పెట్టాలనుకునే వారు నిలబడాలంటే, తాము తెలంగాణకు కొత్తగా ఏమి ఆఫర్ చేస్తారో చెప్పాలి. టిఆర్ ఎస్ ప్రభుత్వ అవినీతి, కెసిఆర్ కుటుంబపాలన అంటే చాలదు. ఆ విషయాల మీద మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపిలు చాలా ముందు కెళ్లాయి.

ఇపుడు షర్మిళ కూడా అదే మాట్లాడుతున్నారు. అదే విషయం మాట్లాడేందుకు కొత్త పార్టీ అవసరమా?

సభల్లో అనౌన్స్ చేసి, పూల మాలవేసి, శాలువ కప్పి నేతలను  స్టేజీ మీదకు పిల్చి పెద్ద పీట వేస్తారు. రాజకీయాల్లో నాయకత్వం అలా అందివ్వరు. సృష్టించుకోవాలి. దీనికి చాణక్యం అవసరం. కేవలం కెసిఆర్ వ్యతిరేకత చాలదు. చాలా కొత్త పార్టీ ప్రయత్నాలు ఫెయిలవుతున్నాయి.

బిఎస్ పి ఉత్తరాది లో బలంగా ఉన్నపుడు కూడా తెలుగు రాష్ట్రాల్లో  విఫలమయింది. కారణం, ఇక్కడి ప్రజలు బేష్ అనదగ్గ కొత్త దనం ఇవ్వలేకనే. ఇట్లాగే ఆమ్ ఆద్మీ పార్టీ కూడా  తెలుగు రాష్ట్రాల్లో కాలూన లేకపోయింది. చివరకు మాజీ ఐఎఎస్ అధికారి జయప్రకాశ్ నారాయణ్ కూడా పార్టీ నడిపించడంలో విఫలమై పోయి, అసలు రాజకీయాలనుంచే తప్పుకోవలసి వచ్చింది.  నిఖార్సయిన నాయకుడు ప్రొఫెసర్ కోదండరామ్ పార్టీ ‘తెలంగాణ జనసమితి’ ఇంకా ఎగరలేక పోతున్నది.

ఇవి కాకుండా తెలంగాణలో చాలా మంది పార్టీలు పెట్టి మాయమయ్యారు. దేవందర్ గౌడ్, జ్ఞానేశ్వర్ లు కూడా కొత్త పార్టీ లు పెట్టారు. ఏమయ్యారు? చివరకు కెఎ పాల్ కూడా పార్టీ  పెట్టారు.  కొత్త పార్టీ పెడితే ఈ డేంజర్ ఉంటుంది. పార్టీ పెట్టడం చాలా సులభం. పార్టీ దావాణం లాగా కాకపోయినా మంటలాగానైనా అంటుకోవాలి. లేకపోతే, కోలుకోలేనంత ఎదురు దెబ్బ తగులుతుంది. 

411 Views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error:
FOLLOW OK No thanks
Which Notifications would you like to receive?